గృహప్రవేశం.. జరిగింది మళ్లీమళ్లీ..
ఇప్పటికే నివసిస్తున్న ఇళ్లకు గృహప్రవేశాలు పిల్లర్ల దశలోని ఇంటికి మళ్లీ శంకుస్థాపన ఇదీ చంద్రబాబు ప్రభుత్వ గృహ ప్రవేశాలు, శంకుస్థాపనల తీరు
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహప్రవేశాల ప్రారంభో త్సవ కార్యక్రమం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అపహాస్యమైంది. పీఎంఏవై అర్బన్ 1.0 పథకం ద్వారా గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించి, ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారుల ఇళ్లను అధికారులు ఎంపిక చేసి మళ్లీ గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించడం స్థానికు లకు నవ్వు తెప్పించింది. నగరంలోని 32వ డివిజన్ దేశాయిపేటలో సిద్ధినేని యానాదిరావు, కుప్పా శ్రీనివాసరావు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. గృహ ప్రవేశాలు జరుపుకొని ఆ ఇళ్లలో నివసిస్తున్నారు. వారి ఇళ్లనే జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన గృహప్రవేశాల కార్యక్రమానికి ఎంపిక చేసింది. ఆ ఇళ్లకు మళ్లీ గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించడంతో ఆ ప్రాంత వాసులు ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్వాహకాన్ని ఆ ప్రాంత వాసులు చెప్పుకొంటూ నవ్వుకుంటున్నారు. చంద్ర బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా గృహాలను నిర్మించకపోగా ఇప్పటికే నివాసం ఉంటున్న పాత గృహాలకు గృహప్రవేశాలు చేయించడమేంటంటూ ఎద్దేవాచేస్తు న్నారు. యానాదిరావు, శ్రీనివాసరావు 2021–22 సంవత్సరంలోనే గృహ నిర్మాణానికి పీఎంఏవై ఫేజ్–1 పథకం ద్వారా మంజూరు పొంది నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం లబ్ధిదారులు గృహాల్లో నివాసం ఉంటున్నారు. కలెక్టర్ డి.కె. బాలాజీ, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కలిసి ఈ గృహాలకు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాది రావు కుమారుడు కటకం లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ హయాంలోనే గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. పునాదుల స్థాయిని పూర్తి చేసి పిల్లర్ల స్థాయికి నిర్మించారు. అనివార్య కారణాలతో గృహ నిర్మాణాన్ని ఆయన నిలిపివేశారు. ప్రస్తుతం పీఎంఏవై 2.0 పథకం ద్వారా కలెక్టర్ బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పిల్లర్ల స్థాయికి చేరిన నిర్మాణం వద్ద బుధవారం శంకుస్థాపన తంతు జరిపించారు. ఇలా జిల్లా కేంద్రమైన మచిలీ పట్నంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణాలు పూర్తిచేసి, మధ్యలో ఆగిపోయిన గృహాలను చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించడం నవ్వులపాలైంది.
గృహప్రవేశం.. జరిగింది మళ్లీమళ్లీ..


