సంపద సృష్టికి సహకారం | - | Sakshi
Sakshi News home page

సంపద సృష్టికి సహకారం

Nov 13 2025 7:44 AM | Updated on Nov 13 2025 7:44 AM

సంపద సృష్టికి సహకారం

సంపద సృష్టికి సహకారం

● సహకార సంఘాల చైర్మన్ల నియామకంలో భారీగా వసూళ్లు ● రూ.40 లక్షలు పలికిన చైర్మన్‌ పదవి ● మరో సొసైటీకి రూ. 30 లక్షలు ● ఎరువులు పక్కదారి పట్టించిన వైనం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): టీడీపీలో డబ్బులిస్తేనే పదవులొస్తాయంటూ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజమని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నిరూపిస్తున్నారు. పార్టీ అధినేత పదే పదే చెప్పే సంపద సృష్టి మాటను అందిపుచ్చుకుని తమ సంపద సృష్టికి మార్గాలు వేసుకుంటున్నారు. సహజ వనరులు ఇసుక, మట్టి, బూడిద, క్వారీలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులకు ఎట్లాగూ సంపదకు కొదవ లేదు. మిగిలిన నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు కాదేదీ సంపద సృష్టికి అనర్హం అంటున్నారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చైర్మన్లను నియమించి సొంత పార్టీ నాయకుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి జేబులు నింపుకుంటున్నారు.

ఎలక్షన్‌ లేదు సెలక్షనే..

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం 424 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 212, ఎన్టీఆర్‌ జిల్లాలో 131 సంఘాలు ఉన్నాయి. సొసైటీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ చంద్రబాబు సర్కార్‌ పాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) త్రిసభ్య కమిటీలను నియమించాలని అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సొసైటీకి చైర్మన్‌, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఎలక్షన్స్‌ నిర్వహించకుండా సెలెక్షన్స్‌ కావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చైర్మన్ల ఎంపిక కాసులు కురిపిస్తోంది. ఏదో ఒక హోదా కావాలని పార్టీలో తిరిగే వారికి పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవులు ఎరవేశారు. సంఘం టర్నోవర్‌, పోటీ పడే వారి సంఖ్యను బట్టి ఒక్కో చైర్మన్‌ పదవికి రూ. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. 40 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

పైసలిచ్చిన వారికే పదవులు..

రూరల్‌ మండల పరిధిలోని రెండు పీఏసీఎస్‌లు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటి టర్నోవర్‌ చాలా ఎక్కువగా ఉంది. ఈ రెంటికి చైర్మన్‌ పదవులకు ఎక్కువ మంది పోటీ పడ్డారు. ఇక్కడ చిత్రమేమిటంటే రెండు చోట్ల కొత్తగా అధికార పార్టీలోకి వచ్చిన వారికే చైర్మన్‌ పదవులు కట్టబెట్టారు. ఇందుకు వీరు ఆ ప్రజా ప్రతినిధులకు భారీగానే ముట్టజెప్పారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నాళ్ల నుంచో పార్టీ కోసం పని చేసిన వారిని కాదని పైసలు ఇచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. 6 గ్రామాల పరిధి కలిగి రూ. 6 కోట్ల టర్నోవర్‌ ఉన్న సొసైటీ చైర్మన్‌ పదవికి ఏకంగా రూ. 30 లక్షలు ప్రజాప్రతినిధికి ముట్టజెప్పి పదవి దక్కించుకున్నట్లు తెలిసింది. రూరల్‌ మండలంలోనే మరో సొసైటీ చైర్మన్‌ పదవికి ఓ వ్యాపారి నుంచి రూ. 40 లక్షలు వసూలు చేసినట్లు అధికార పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. ఎరువులు , పురుగు మందుల వ్యాపారులకు సొసైటీ చైర్మన్‌ పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పదవులు దక్కించుకున్న ఇద్దరు చైర్మన్లు పోలవరం మట్టి అక్రమ తరలింపులో చేయి తిరిగిన వారికి పేరుంది. సొసైటీ చైర్మన్‌ పదవుల్లో సామాజిక న్యాయం పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. ఎసైన్డ్‌ భూములు కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి, రైతులతో ఏ మాత్రం సంబంధం లేని వారికి కేవలం డబ్బులు తీసుకుని పదువులు ఇచ్చారని చెబుతున్నారు. టర్నోవర్‌ తక్కువగా ఉన్న చోట సొసైటీ స్థాయిని బట్టి రూ. 2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

ఎరువులు పక్కదారి...

సహకార సంఘాల చైర్మన్‌ పదవులకు డబ్బులు ఖర్చుపెట్టిన వాళ్లు ఎరువులను చక్కటి ఆదాయ వనరుగా మలచుకున్నారు. నందిగామ ప్రాంతానికి చెందిన ఓ సొసైటీ నుంచి ఎరువులు తరలిస్తుండగా పట్టుబడ్డాయి. అలాగే మైలవరం నియోజకవర్గ పరిధిలో గోడౌన్‌లో ఉండాల్సిన యూరియా ఆ నాయకుడుకి చెందిన షెడ్డులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డబ్బులు పెట్టి చైర్మన్‌ పదవులు దక్కించుకున్న వారు యూరియాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మరి కొందరు సొసైటీల ద్వారా రైతులకు అందించే రుణాల్లో కొత్తగా నియామకమైన చైర్మన్లు పర్సంటేజ్‌లు నిర్ణయించి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అర్హత ఉన్న రైతులకు రుణాలు ఇవ్వకుండా తమకు కావాల్సిన వారికే రుణాలు మంజూరు చేయిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా సహకార సంఘాల చైర్మన్ల పదవుల్లోనూ ‘వసూళ్లు చేయవచ్చని ప్రజాప్రతినిధులు నిరూపించారని చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement