పేదలందరూ సొంతింటి కల నిజం చేసుకోవాలి
కృష్ణా కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నంటౌన్: జిల్లాలో పేదలందరూ సొంతింటి కల నిజం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే రాయచోటిలో 3,00,192 గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని చింతగుంటపాలెంలో పీఎంఏవై అర్బన్ 1.0 పథకం కింద కుప్పా శ్రీనివాసరావు, సిద్ధినేని యానాదిరావు నిర్మించుకున్న గృహాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం కటకం లక్ష్మీనారాయణ– ఫణి కుమారీలకు చెందిన పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఆర్టీసీ చైర్మన్ పూజలు నిర్వహించి లబ్ధిదారులను అభినందించారు. అనంతరం దేశాయిపేటలోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో 6,708 గృహాలు పూర్తయ్యాయన్నారు. అందులో మచిలీపట్నంలో నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయన్నారు. ఇల్లు మంజూరు కానీ కొత్త వారికి పిఎంఏ వై 2.0 పథకం కింద ఈ నెలాఖరి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఈ పథకంలో గృహ నిర్మాణానికి రూ. 2. 50 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కొత్త లబ్ధిదారులకు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధిపతి పోతురాజు, ఈఈ వెంకటరావు, రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్ పి.వి. ఫణికుమార్, మచిలీపట్నం అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ పాల్గొన్నారు.


