సమాజ శ్రేయస్సుకు ‘ప్రజా ఉద్యమం’ | - | Sakshi
Sakshi News home page

సమాజ శ్రేయస్సుకు ‘ప్రజా ఉద్యమం’

Nov 12 2025 5:51 AM | Updated on Nov 12 2025 5:51 AM

సమాజ శ్రేయస్సుకు ‘ప్రజా ఉద్యమం’

సమాజ శ్రేయస్సుకు ‘ప్రజా ఉద్యమం’

● వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ పోరుబాట ● నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజక వర్గంలో రామానాయుడుపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో పురవీధుల్లో ర్యాలీగా తరలివెళ్లి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలపనున్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.

పామర్రు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన సెంటర్‌ మీదుగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లనున్నారు. మాజీ శాసనసభ్యుడు కై లే అనిల్‌కుమార్‌ సారథ్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించనున్నారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్‌ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లనున్నారు. తొలుత బస్టాండ్‌ సెంటరు వద్ద ఉన్న మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.

పెడన నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో పురవీధుల్లో ర్యాలీగా తరలివెళ్లనున్నారు. తోటమూలలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.

పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి సారథ్యంలో పెనమలూరు సెంటరు నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రగా వెళ్లి కార్యాలయం వద్ద నిరసన తెలిపిన అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.

గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వల్లభనేని వంశీ నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లనున్నారు. కార్యాలయం వద్ద నిరసన తెలిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రంలోని పది ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కార్పొరేట్లకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రజా ఉద్యమం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో బుధవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలతో పాటు తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేయనున్నారు. అందుకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఇప్పటికే సమాయత్తం కాగా, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమం ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించి, ప్రజల ఆకాంక్షను చంద్రబాబు ప్రభుత్వానికి తెలియజెప్పనున్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తే వైద్య విద్య, వైద్యం విషయంలో పేదలపై పడే భారాలను ఇప్పటికే పలువురు మేథావులు చెబుతున్నా, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోని వైనంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement