యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పెదఈర్లపాడు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 50 ఎంఎస్‌ఎంఈ పార్కులను మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బాపులపాడు మండలం వేలేరు వీరవల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.12 కోట్లతో ఏర్పాటు చేస్తున్న శ్రీవేద ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కృష్ణా విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అకాడమిక్ బ్లాకులో ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు ఆడిటోరియం నుంచి వర్చువల్‌గా కలెక్టర్ బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.రాంజీ తదితరులు పాల్గొన్నారు. తొలుత మచిలీపట్నం మండలం రుద్రవరంలో దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్, కొనకళ్ల నారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిప్రా ల్యాబ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వేద ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వి.సత్యనారాయణ, డీఐసీ జీఎం ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ డెప్యూటీ జోనల్ మేనేజర్ దీవన్, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య ఉష, రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు, డీఐసీ డీడీ నాగేశ్వరరావు, ఎన్‌ఐసీ అధికా రులు సెల్వినా, ఫణి కుమార్, తహసిల్దారు మధు సూదన్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


