
విద్యార్థులను చితకబాదిన టీచర్
కిలేశపురం(ఇబ్రహీంపట్నం):విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను విచక్షణా రహితంగా చితకబాదింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం (కొత్తజూపూడి)లో గురువారం చోటుచేసుకుంది. సాయంత్రం ఇంటికెళ్లిన విద్యార్థులు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శుక్రవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను నిలదీసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చెప్పిన విషయాల మేరకు.. కిలేశపురంలోని ఎంపీపీ పాఠశాలలో 17 మంది విద్యార్థులు నాలుగో తరగతి చదువుతున్నారు. ఒకరిద్దరు పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహించిన టీచర్ రజని అందరికీ భయం ఉండాలని భావించి తరగతిలోని మిగిలిన విద్యార్థులందరినీ చితకబాదినట్లు చెప్పారు. ఓ బాలికకు చేతి శరీరంపై ఎర్రగా కందిపోయింది. మరో బాలిక అరచేతిని టేబుల్‌పై పెట్టి వేళ్లపై కర్రతో కొట్టడంతో నొప్పిని భరించలేక పోయి ఏడ్చానని స్వయంగా చెప్పింది. హెచ్‌ఎం బేబీరాణి గాయపడిన బాలికను ఓదార్చారు. ఓబాలిక తండ్రి బాణావత్ జగన్నాథ్‌నాయక్ ఈఘటనపై ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఇక చదివించమని, డబ్బులు ఖర్చు అయినా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తామని టీసీ ఇవ్వాలని కోరారు. పిల్లలను చితకబాదిన టీచర్‌పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులను చితకబాదిన టీచర్