
సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసు శాఖను మూసేయాలి. డీజీపీ నిద్రపోతున్నారా?. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ ధ్వజమెత్తింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని మండిపడింది.
ఇప్పటికే నిందితులు సాక్షాలను తారుమారు చేసే ఉంటారు. అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ హైకోర్టు విమర్శలు గుప్పించింది. ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది. మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు.
సీఐడీలో ఐజీ ర్యాంకు అధికారి లేకుంటే.. మరో అధికారితో పనిచేయించుకోవచ్చుగా? మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడీలో లేరా?.ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేం నిందించాలి. పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.