
కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
మూలపాడు(ఇబ్రహీంపట్నం):అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రమైన గాయాలయ్యాయి. మండలంలోని మూలపాడు గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు... కంచికచర్లకు చెందిన ఐలపోగు కాటయ్య, తిరుపతిరావు కలసి నున్న గ్రామంలో పాలాలకు సరిహద్దు రాళ్లు పాతే పనులకు వెళ్లారు. పనులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో మూలపాడు వద్దకు చేరుకునే సమయానికి విజయవాడ వైపు నుంచి దూసుకొచ్చిన కారు వెనుక వైపు నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ఐలపోగు కాటయ్యకు తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. 108 వాహన సిబ్బంది బాధితులను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషయంగా మారడంతో సమీపంలోని ఓప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి చేరిన ఎస్‌ఐ రాజు బాధితులు, కారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.