
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
ఇబ్రహీంపట్నం: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కాచవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పరిసర గ్రామాల్లో యాచక వృత్తి చేసుకునే వ్యక్తి కాచవరం కరుణా హెల్త్ సెంటర్ సమీపంలో 65 నెంబర్ హైవే దాటుతున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటాయి. ఎత్తు 5.5 అడుగులు, నలుపు రంగు ఫుల్‌హ్యాండ్ టీషర్ట్, నలుపురంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.. వీఆర్వో జయదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు స్టేషన్ సీఐ చంద్రశేఖర్, 9440627084, ఎస్‌ఐ రాజు 98661 14556 ఫోన్ నెంబర్‌లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
లారీ ఢీకొని ముఠా కార్మికుడు....
గన్నవరం: లారీ ఢీకొని ముఠా కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన కొత్తపేట వద్ద చైన్నె–కోల్‌కత్తా జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కొండపావులూరు శివారు ముదిరాజుపాలెం గ్రామానికి చెందిన గోనేపల్లి రాధాకృష్ణ (47) గన్నవరంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముఠా పని నిమిత్తం వెళ్లేందుకు సైకిల్‌పై కొత్తపేట వద్ద జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి ఏలూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక టైర్లు కిందపడి రాధాకృష్ణ తల భాగం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు.
తూములో ఇరుక్కొని దివ్యాంగుడు...
తిరువూరు: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి చెరువు తూము లాకులు ఎత్తుతుండగా నీటి ఉద్ధృతికి దివ్యాంగ రైతు ఆదివారం మృతి చెందిన సంఘటన ఏకొండూరు మండలం కొండూరు తండాలో జరిగింది. తండాకు చెందిన గిరిజన దివ్యాంగ రైతు భూక్యా గోపయ్య (43) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తూము గేటు లాకులు సరిగా లేకపోవడంతో తూములో ఇరుక్కుపోయాడు. ఊపిరాడక తూములోనే గోపయ్య మృతిచెందాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏకొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కుక్క అడ్డురావడంతో...
షేర్‌మహ్మద్‌పేట(జగ్గయ్యపేట): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (35) పట్టణం నుంచి ద్విచక్ర వాహనంపై షేర్‌మహ్మద్‌పేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో కుక్క అడ్డురావటంతో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలవటంతో గమనించిన స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం