
పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఉధృతం
మచిలీపట్నం అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యుల సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి తెలిపారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా కుదింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లాలోని పీహెచ్‌సీలలో వైద్య సేవలను వైద్యులు బహిష్కరించారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దీప్తి మాట్లాడుతూ గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామన్నారు. వైద్యులు 20 శాతం పీజీ ఇన్ సర్వీస్ కోటా అన్ని క్లినికల్ స్పెషాలిటీలకూ వర్తించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్స్, ఉద్యోగోన్నతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పలువురు పీహెచ్‌సీ వైద్యులు మాట్లాడుతూ గతంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్‌లో 50 శాతం ఇన్ సర్వీస్ కోటా ఉండేదని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్‌లో 30 శాతానికి తగ్గించిందని తెలిపారు. గతేడాది వైద్యుల ఆందోళనల తర్వాత క్లినికల్ కోర్సుల్లో 20 శాతం వరకు పెంచి, ఈ విద్యా సంవత్సరానికి మళ్లీ కోటాను 15 శాతానికి తగ్గించడంతో సమ్మె చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. సమ్మెను జటిలం చేయకుండా ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.బాలాజీ (కపిలేశ్వరపురం పీహెచ్‌సీ), డాక్టర్ స్ఫూర్తి (రామాపురం పీహెచ్‌సీ), డాక్టర్ రాజా (పెనమలూరు పీహెచ్‌సీ), డాక్టర్ చంద్రిక (ఉప్పులూరు పీహెచ్‌సీ), డాక్టర్ పర్వేజ్ (పెడన పీహెచ్‌సీ), డాక్టర్ తేజ( మోటూరు పీహెచ్‌సీ), డీఎంహెచ్‌ఓ కార్యాలయం డాక్టర్లు అరుణ్ కుమార్, నిరీక్షణ, అవనిగడ్డ పి.పి యూనిట్ డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు
డాక్టర్ పి.దీప్తి
గ్రామీణ వైద్య సేవలకు బ్రేక్