
ఎడ్లంకలో పర్యటించిన జాయింట్ కలెక్టర్
అవనిగడ్డ: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీవో కె.స్వాతి మంగళవారం పాత ఎడ్లంక గ్రామంలో పర్యటించారు. కోతకు గురైన ప్రాంతం, కొట్టుకుపోయిన నివాసాలను పరిశీలించారు. అనంతరం నదిలో కొట్టుకుపోయిన ఇళ్ల యజమానులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తామని, గ్రామంలోనే స్థలాలు ఇస్తామని చెప్పగా గ్రామస్తులు నిరాకరించారు. నదీ ప్రవాహం తీవ్రంగా ఉందని, భవిష్యత్తులో గ్రామం పూర్తిగా కనుమరుగవుతుందని గ్రామంలోని నివాసాలు ఇచ్చినా... ఇక్కడ తాము ఉండమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం గ్రామస్తులు అందరికీ అండగా ఉంటుందని పూర్తిస్థాయిలో గ్రామానికి రక్షణ కల్పిస్తుందని, అప్పటివరకూ నివాసాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా గ్రామంలోని రిహాబిటేషన్ కింద వసతి ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలోని పరిస్థితులను కలెక్టర్‌కు వివరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రవితేజ, అవనిగడ్డ తహసీల్దార్ కె.నాగేశ్వరరావు, పలువురు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.