
నడిరోడ్డుపై టీడీపీ నేతల బాహాబాహీ
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టీడీపీలో ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. రెండు రోజుల క్రితం టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ మంగళవారం వెలుగుచూసింది. ఓ రహదారి మరమ్మతుల అంశంపై సర్పంచ్ సర్నాల గంగారత్నం భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ, గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసయ్య వారి వారి అనుచరులతో ఘర్షణకు దిగిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈనెల 28న గూడవల్లి నరసయ్య గ్రామంలోని బీఎంపీఎస్ రోడ్డులో మనుషులను పురమాయించి రహదారిపై గోతులను పూడ్పించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ ఘటనా స్థలానికి వెళ్లి మీరెవరు పనులు చేయించడానికని ప్రశ్నించాడు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీ రోడ్డులో పనులు ఎలా చేయిస్తారని నిలదీశాడు. సుమారు రూ.82లక్షలతో ఈ రహదారి అభివృద్ధికి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించామన్నారు. రహదారిపై గోతులు పడి అధ్వానంగా మారినా పంచాయతీ పట్టించుకోనందునే తాము పనులు చేయిస్తున్నామని గూడవల్లి నరసయ్య బదులిచ్చారు. మాటా మాటా పెరిగి బాలాజీ, నరసయ్య మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నువ్వు ఎంతంటే నువ్వు ఎంతంటూ దూషించుకున్నారు. గొడవ కాస్తా పెద్దదవడంతో ఇరు వర్గాల అనుచరులు ఒకరినొకరు తోసుకుంటూ నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. దీంతో స్థానికులు కలుగజేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఒకే పార్టీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ కాస్తా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి వెళ్లడంతో పార్టీ పరువు బజారు కీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సర్పంచ్, ఏఎంసీ చైర్మన్
వర్గీయుల మధ్య తోపులాట