
మహిళల ఆరోగ్య రక్షణకు స్వస్థనారి స్వశక్తి పరివార్
మచిలీపట్నంఅర్బన్: మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మీకోసం సమావేశ మందిరంలో సోమవారం స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రెండు వారాలపాటు నిర్వహించే వైద్యశిబిరాల్లో 429 కేంద్రాల్లో వివిధ పరీక్షలు, వైద్యసేవలు అందిస్తామన్నారు. జిల్లా రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖాధికారులు, హెల్త్ వెల్నెస్ సెంటర్ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.వెంకట్రావు మాట్లాడుతూ మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. థైరాయిడ్, బీపీ, సుగర్ వంటి సమస్యలపై కూడా వైద్యులు పరిశీలన చేస్తారన్నారు. యాన్‌ఎన్‌సీ స్క్రీనింగ్, కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య పరీక్షలు, పాప్స్మియర్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరీక్షలు, రక్తహీనత నివారణ చర్యలు, మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కెఆర్‌ఆర్‌సీ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సర్వ శిక్ష ప్రాజెక్ట్ అధికారి కుముదిని సింగ్, డీసీహెచ్ ఎస్.శేషుకుమార్, డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓ చంద్రశేఖర్