
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
కోడూరు: అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చాణిక్య సోమవారం తెలిపిన వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన రాజబోయిన సోమేశ్వరరావు(35) గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల కడుపులో పేగు పూసి ఆహారం తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నాడు. తరచూ కడుపు నొప్పి రావడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం సాయంత్రం పందికొక్కులకు పెట్టే మందు బిళ్లలను తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు సోమేశ్వరరావును హుటాహుటినా అవనిగడ్డలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం విజయవాడ తరలిస్తుండగా సోమేశ్వరరావు మృతి చెందినట్లు ఎస్‌ఐ చెప్పారు. మృతుడు తల్లి వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.