
నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కృష్ణాజిల్లా నూతన ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన కృష్ణాజిల్లాకు ఎస్పీగా రావటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి విధి నిర్వహణ కనపరుస్తానన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలని, రాజకీయ నాయకులు, అధికారుల మీద ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేయటం, ప్రచురించటం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తొలుత నూతన ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు జిల్లా పోలీసు అధికారులు సకల లాంఛనాలతో ఘనస్వాగతం పలికారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీలు వి.వి.నాయుడు, బి.సత్యనారాయణలతో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
నూతన ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్‌నాయుడు
విద్యాసాగర్‌నాయుడు ప్రస్థానం
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్‌నాయుడు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. తండ్రి రైల్వేలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. తల్లి గృహిణి. 2016లో పోలీస్ శాఖలోకి అడుగుపెట్టారు. ఆయన ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే 24 ఏళ్లకే సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించారు. అనంతరం అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, ఏఎస్పీ చింతపల్లి, డీసీపీ లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం, ఎస్పీ గ్రేహౌండ్స్‌తో పాటు అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కృష్ణాజిల్లా ఎస్పీగా వచ్చారు.