
సంస్కరణల పేరుతో విద్యారంగం నిర్వీర్యం
గన్నవరం: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్థిక, విద్యారంగ సమస్యలపై మంగళవారం యూటీఎఫ్ చేపట్టిన రణభేరి జిల్లా బైక్ ర్యాలీని గన్నవరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించకపోగా ఉపాధ్యాయులను సమాజంలో దోషులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. విద్యాహక్కు చట్టం, ప్రపంచ బ్యాంక్ సాల్ట్ పథకం అమలు వల్ల మూడో వంతు పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్‌గా మారా యని చెప్పారు. ఉపాధ్యాయులను చదువులకు కాకుండా బోధనేతర పనులకు ఉపయోగించడం వల్ల విద్యా రంగం కుంటుపడుతుందన్నారు. కనీసం ఉపాధ్యాయ, ఉద్యోగ నేతలతో మాట్లాడే తీరిక కూడా సీఎం చంద్రబాబుకు లేకపోవడం శోచనీయమన్నారు. విద్యారంగ సంస్కరణల వల్ల విద్యార్థులకు జరిగిన మేలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
25న బహిరంగ సభ..
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి పదిహేను నెలలు గడిచినప్పటికీ కొత్త కమిషనర్‌ను ప్రభుత్వం నియమించలేదన్నారు. కనీసం ఒక డీఏ కూడా ఇవ్వలేదని, పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. ప్ర భు త్వం తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 25న వేలాది మంది ఉపాధ్యాయులతో బహిరంగ సభ జరుగుతుందన్నారు. సంస్కరణలపేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని మరో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ధ్వజ మెత్తారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సౌకత్ హుస్సేన్, కార్యదర్శి బి. కనకరావు, కోశాధికారి మరీదు వరప్రసాద్, గౌరవాధ్యక్షుడు లెనిన్‌బాబు, నాయకులు పాల్గొన్నారు.
సమస్యలపై క్షేత్రస్థాయిలో
ఉద్యమించాల్సిందే
యూటీఎఫ్ రణభేరిలో వక్తలు