
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కోడూరు: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు. ఎస్‌ఐ చాణిక్య కథనం ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగవెంకట శ్రీనివాసరావు(28) ఈ నెల 14న ఉల్లిపాలెం వారధి సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నదిలో పడి గల్లంతయ్యాడు. శ్రీనివాసరావు తండ్రి నాగబసవయ్య ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి, శ్రీనివాసరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, స్థానిక మత్స్యకారుల సహకారంతో రెండు రోజుల పాటు నదిలో ప్రత్యేక బోట్లపై గాలింపు చేపట్టగా, మంగళవారం ఉదయం శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు. హంసలదీవి–ఉల్లిపాలెం గ్రామాల సమీపంలో మడ అడవుల్లో చిక్కుకొని శ్రీనివాసరావు మృతదేహం ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. శవపంచనామా అనంతరం ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం జరిపి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
నందివాడ: విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయాల పాలైన ఘటన నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో మంగళవారం చోటుచేసుకుంది. పెదవేగి మండలం గార్లమడుగు గ్రామనికి చెందిన 10మంది వ్యక్తులు దేవీశరన్నవరాత్రులు సందర్భంగా ఇనుప పందిరి వేస్తుండగా అందులో పోతురాజు పవన్ కుమార్(25), అర్జున్(22) పందిరి పైన ఉండి పైపులు తగిలిస్తున్నారు. ఈ క్రమంలో పైన ఉన్న కరెంట్ వైర్లు ప్రమాదవశాత్తూ పవన్ చేతికి తగలటం వల్ల షాక్ తగిలి కిందకి పడిపోయాడు. తలకి గాయం కాగా హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే పైపు పట్టుకొని అర్జున్‌కి కూడా కరెంట్ షాక్ తగలడంతో తను కూడా కిందపడిపోయాడు. దీంతో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అతడిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుని బాబాయి అయిన పోతురాజు వెంకటేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె. శ్రీనివాస్ తెలిపారు.
18న జిల్లా స్థాయి పోటీలు
గూడూరు: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న అండర్ 14, 17 బాలురు, బాలికల విభాగాలలో జిల్లా స్థాయి షూటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలు మత్తి అరుణ, గంపా రాంబాబు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలను విజయవాడ భవానీపురంలోని గ్లోరియస్ షూటింగ్ అకాడమీలో ఏర్పాటు చేశామన్నారు.
● అండర్–17 బాలురు, బాలికల విభాగం వెయిట్ లిఫ్టింగ్ జిల్లా స్థాయి ఎంపికలు చిల్లకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను, అండర్–14, 17 బాలురు, బాలికల విభాగం స్విమ్మింగ్ పోటీలను ఈడుపుగల్లులోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్ నందు జరుగుతాయని వెల్లడించారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్స్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం