
సకాలంలో అర్జీలు పరిష్కరించండి
మీకోసంలో 166 అర్జీలు స్వీకరణ డీఆర్వో చంద్రశేఖరరావు
చిలకలపూడి(మచిలీపట్నం): మీకోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను సకాలంలో పరిష్క రించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత డీఆర్వో మాట్లాడుతూ అర్జీలు పరిష్కరించే అధికారి తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి అతని సమస్య పరిష్కారమైందో, లేదో విచారించాలన్నారు. ఐ గాట్ కర్మయోగి ఆన్‌లైన్ శిక్షణ తరగతుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో ఉందని అందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఎక్కువగా అర్జీలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాల్‌సెంటర్ ఫీడ్ బ్యాక్‌లో 1100 లో సంతృప్తిస్థాయిలో కృష్ణాజిల్లా వెనుకబడి ఉందని అసంతృప్తి మరలా ఏ ప్రభుత్వశాఖలో కనపడుతుందో ఆ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మీకోసంలో అధికారులు మొత్తం 166 అర్జీలను స్వీకరించారు.
ప్రధానమైన అర్జీలు ఇవే :
● తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామానికి చెందిన కె.వరలక్ష్మి తన కుమారుడు నరేష్ గరిక పర్రు హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడని, తనకు రావాల్సిన తల్లికి వందనం డబ్బులు ఆవుల స్వప్న అనే మహిళ ఖాతాకు జమ అయ్యాయని, తనకు తల్లికి వందనం డబ్బులు వచ్చేలా చేయాలని కోరారు.
● మచిలీపట్నం 29వ డివిజన్‌లో 29/346–1 డోర్ నంబరు గల గృహ యజమాని రహదారిని ఆక్రమించారని, ఈ స్థలాన్ని రీ–సర్వే చేయించి మునిసిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి.మురళీకృష్ణ అర్జీ ఇచ్చారు.