చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీ అన్నారు. రాజీ పడదగిన కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లు, అన్ని రకాల సివిల్ కేసులు ఈ లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చన్నారు.
ఉత్సాహంగా కళా ఉత్సవ్ పోటీలు
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు గ్రామంలోని డైట్ కళాశాలలో గురువారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు ఘనంగా జరిగాయి. డైట్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కళా ఉత్సవానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 55మండలాల నుంచి 242మంది జిల్లా పరిషత్, గవర్నమెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులు.. గాత్రం, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్య కళలు, సంప్రదాయ కథల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని డైట్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులను ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాల రూపంలో అందించారు.
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
గన్నవరం: స్థానిక మండల మహిళా సమైక్య వెలుగు కార్యాలయాన్ని గురువారం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ పరస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన మండల సమైక్య ఈసీ సమావేశంలో పాల్గొన్న ఆయన స్వయం సహాయక సంఘాల పనితీరుపై సమీక్ష జరిపారు. మండల సమైక్య విజన్ బిల్డింగ్ నిర్దేశాలు, లక్ష్యాలు, వాటిని సాధించడానికి సభ్యుల ప్రణాళికలు, సబ్ కమిటీల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసరపల్లిలోని చరిత గ్రామెక్య సంఘం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఫర్నీచర్ వ్యాపారం, బోటిక్ డిజైనింగ్ వర్క్స్, వన్ గ్రామ్ గోల్డ్, పిండి మర నిర్వహిస్తూ ఆదాయం సాధిస్తున్న మహిళలను ఆయన అభినందించారు. మిగిలిన సభ్యులు కూడా సంఘం ద్వారా పొందిన రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మండల సమైక్య అధ్యక్షురాలు కె. రమా, కార్యదర్శి డి. సుశీల, కోశాధికారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–అనకాపల్లి ప్రత్యేక రైలు (07035) ఈ నెల 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి శనివారం నడవనుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07036) ఈ నెల 14 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారాల్లో నడపనున్నారు. రెండు మార్గాలలో ఈ రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్లు, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి స్టేషన్‌లలో ఆగుతుంది.

రేపు జాతీయ లోక్ అదాలత్

రేపు జాతీయ లోక్ అదాలత్