
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు
బీజేపీ తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విదేశాంగ విధానం, లౌకికవాదం, ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన పరిస్థితులు–సీపీఎం వైఖరిపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల వామపక్ష ఉద్యమానికి గురుతర బాధ్యత ఉందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ భూములు యథేచ్ఛగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సదస్సులో సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు దుర్మరణం
మోపిదేవి: మండల కేంద్రం మోపిదేవి ఎస్ విహార్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గొరిపర్తి సుబ్రహ్మణ్యం(32) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం తన అత్తగారి ఊరు అయిన మచిలీపట్నం వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో ఎదురుగా రొయ్యల లోడ్‌తో వస్తున్న లారీని మోపిదేవి వద్ద బలంగా ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మృతునికి భార్య అంజలి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.