మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వదంతులు నమ్మవద్దని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం మంత్రి పొంగూరు నారాయణ న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించి, డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)లో మంత్రి నారాయణ.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, పురపాలక శాఖ డైరెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డయేరియా ప్రబలకుండా ఇప్పటికే తీసుకున్న చర్యలపై చర్చించారు.
నీటి సరఫరా నిలిపేయండి..
మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజరాజేశ్వరిపేటలో ముందుజాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి ట్యాంకర్ల ద్వారా, వివిధ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించామని.. కాచి వడపోసిన నీటిని తాగడం వంటి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్య శిబిరం, న్యూ జీజీహెచ్‌లో బాధితులకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఒకసారి నీటి నమూనాలను పరీక్షించామని తెలిపారు. లోపాలు కనిపించలేదని, మరిన్ని పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యకు అసలు కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బాధితులున్న కేర్ అండ్ షేర్ స్కూల్‌కి ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి వెళ్లి పరామర్శించారు.

డయేరియాపై వదంతులు నమ్మవద్దు