
డబ్బులు దండుకునేందుకే ‘విజయవాడ ఉత్సవ్’
దుర్గమ్మ ఉత్సవాలకు పోటీగా నిర్వహించడం దారుణం ఇది దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రాధాన్యం తగ్గించడమే వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేవీ శరన్నవరాత్రుల సమయంలో నగరంలో ఆధ్మాతిక శోభ వెల్లివిరుస్తుంది.. అలాంటి సమయంలో ఈ వేడుకలకు పోటీగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం అంటే దసరా ప్రాధాన్యతను తగ్గించడం కాదా అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు దండుకునేందుకే స్థానిక ఎంపీ విజయవాడ ఉత్సవ్‌ను తెరపైకి తెచ్చారని అవినాష్ ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వారు దీనిని ఖండించాలన్నారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై శ్రద్ధ చూపడం మానేసి.. విజయవాడ ఉత్సవ్ మీద దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కలుగజేసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దలందరినీ కలుపుకుని వాటిని అడ్డుకుని తీరుతామన్నారు. దసరా ఉత్సవాలకు పోటీగా మరొకటి నిర్వహించే ప్రయత్నాన్ని ప్రజల సహకారంతో నిరోధిస్తామని హెచ్చరించారు.
40 ఎకరాలు కబ్జా..
కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లాలో ఎప్పుడూ జరగని సంఘటనలు జరిగాయని అవినాష్ ఆరోపించారు. మంత్రుల దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. గొల్లపూడిలోని దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. ఎంతోమంది గొప్పవారు మంత్రులు, ఎంపీలుగా పనిచేశారు గానీ దేవాలయాల భూములు దోచుకోలేదన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మట్టి, కాంట్రాక్టులు, భూములు అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లు దేవాలయాల భూముల్లో కట్టడం ఏమి టని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. రూ.450 కోట్లు విలువ చేసే భూమిని దోచుకోవాలని ప్లాన్ చేశారన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా తమ విధులకు ద్రోహం చేస్తున్నారని, కూటమి నేతలు ఏమి చెబితే అది సిగ్గు లేకుండా ఆచరిస్తున్నారన్నారు.