
మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి నేతన్న భరోసా ఇవ్వాలి
చల్లపల్లి: మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి నేతన్న భరోసా పథకం ద్వారా రూ.36వేలు ఇవ్వాలని, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రిబేటు, యారన్ సబ్సిడీ వంటి ఇంటెన్సివ్స్ రూ.127.87 కోట్లు వెంటనే చెల్లించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుబాట సాగిద్దాం.. చేనేత పరిశ్రమను రక్షించుకుందాం.. అనే నినాదంతో చేనేత సహకార సంఘాల, సహకారేతర కార్మికుల ఉపాధికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత అధ్యయన యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన పెడనలో ప్రారంభించిన ఈ యాత్ర పోలవరం, కప్పలదొడ్డి, కాజ, ఘంటసాల, చల్లపల్లి ప్రాంతాల మీదుగా సాగి ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ముగిసిందన్నారు. యాత్రలో చేనే త కార్మికుల నుంచి వచ్చిన సమస్యలను, పాత సమస్యలను రెండింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని, వాటిని పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొగిడే మాధవస్వామి, ఉపాధ్యక్షుడు జక్కల పీతాంబరరావు, జిల్లా అధ్యక్షుడు కోదాటి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగేశ్వరరావు