
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
పెనమలూరు: పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగిన హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిందని సీఐ వెంకటరమణ తెలిపారు. గంగూరు గోడౌన్ వద్ద టీ అమ్ముకొని జీవించే భర్త లేని పి.రమాదేవి (40)తో కంకిపాడుకు చెందిన ముప్పిడి శ్రీనివాసరావుకు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వాటిల్లో వివాదం రావటంతో 2021, మే 31న శ్రీనివాసరావు రోకలిబండతో రమాదేవిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పటి సీఐ ముత్యాల సత్యనారాయణ హత్య కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే ఏడాది జూన్ 3వ తేదీన అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు. ఆ తరువాత అతని పై రౌడీషీట్ కూడా తెరిచారు. ఈ కేసు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో విచారణ చేశారు. మహిళా సెషన్స్ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి 13 మంది సాక్షులను విచారించి ముద్దాయిపై నేరం రుజువు కావటంతో గురువారం తీర్పు ఇచ్చారు. ముద్దాయి శ్రీనివాసరావుకు జీవిత ఖైదు విధించి రూ. 5 వేలు జరిమానా విధించారు.
ప్రశ్నిస్తే శిక్షిస్తారా?
చల్లపల్లి: పిల్లలు తినే అన్నంలో పురుగులు వచ్చాయని ప్రశ్నించినందుకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ వైస్ చైర్మన్ కుంభా లక్ష్మీ దుర్గాభవానీని పదవి నుంచి తొలగిస్తారా అంటూ జాతీయ గిరిజన ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంభా లక్ష్మయ్య, దేవరకొండ వసంత్ ప్రశ్నించారు. శుక్రవారం నేతలు భవాని ఇంటికి వెళ్లి మండల పరిధిలోని పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 10వ తేదీన మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన విషయంపై లక్ష్మీదుర్గాభవాని స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువతో సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అన్నంలో పురుగులు వచ్చాయన్న విషయాన్ని దాచిపెట్టకుండా ఎందుకు బహిర్గతం చేశావని తహసీల్దార్ డి.వనజాక్షి దుర్గాభవానీపై చేసిన వ్యాఖ్య లు గర్హనీయమన్నారు. పదవి నుంచి తొలగించాలని అవమానకరంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురిచేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు.