
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలో విజృంభిస్తున్న డయేరియాకు మరొకరు బలయ్యారు. గత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న నరసింహ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన గద్వాల నరసింహ(38) భార్యతో విభేదాలు రావడంతో ఒక్కడే ఉంటున్నాడు. నరసింహ ఇంటి కింద భాగంలో ఉంటుండగా, అతని తమ్ముడి కుటుంబం ఇంటి పైభాగంలో ఉంటోంది.
గత 4 రోజుల నుంచి ఆ ఇంటిల్లిపాది డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. నరసింహ తమ్ముడి కుమార్తెకు కూడా వాంతులు, విరేచనాలు కావడంతో వారి కుటుంబ సభ్యులంతా 2 రోజుల నుంచి పాపతో పాటు హాస్పిటల్‌లోనే ఉంటున్నారు. శుక్రవారం నరసింహ వాంతులు, విరేచనాలతో నీరసించిపోయాడు. సాయంత్రానికి అతని పరిస్థితి విషమించడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.