
సర్కారు తమాషా
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా
జెడ్పీ సమావేశంలో నిలదీసిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు
రెండు గంటలకు పైగా వాడీవేడి చర్చ చైర్ పర్సన్ పోడియం వద్ద నిరసన ప్రొటోకాల్ పాటించని ఇంజినీరింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం సభలోకి పోలీసులు రావటంపై అభ్యంతరం సమావేశానికి హాజరుకాని మంత్రులు, ఎంపీలు
ఎరువుల గోస..
14 నెలలుగా ‘గౌరవం’ లేదు
మచిలీపట్నంటౌన్: జిల్లాలో యూరియా కొరతపై జెడ్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. జిల్లా వ్యాప్తంగా సరిపడినంత యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై సభ్యులు అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా యూరియా కొరత అంశంపై చర్చ సాగింది. వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పోడియంను ముట్టడించారు. ఈ చర్చ జరిగే సమయంలో సభలో సభ్యుల వద్దకు పోలీసులు రావటాన్ని సభ్యులు తప్పుపట్టారు.
కొరతే లేదంటూ వితండవాదం..
ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి జిల్లాలో యూరియా కొరత లేదంటూ పేర్కొనటంతో పెదపారుపూడి ఎంపీపీ గోదం సురేష్‌తో పాటు జెడ్పీ వైస్‌చైర్మన్ గుదిమళ్ల కృష్ణంరాజు, గన్నవరం, కృత్తివెన్ను, కంచికచర్ల జెడ్పీటీసీలు అన్నవరపు ఎలిజిబెత్ రాణి, మైలా రత్నకుమారి, వేల్పుల ప్రశాంతి, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని పేర్కొనడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలు పోడియం వద్దకు చేరుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంత మేర వరి సాగవుతోంది? దీనికి ఎంత మేర యూరియా అవసరమవుతుందో లెక్కకట్టి, ప్రణాళికాబద్ధంగా అధికారులు వ్యవహరించలేదన్నారు. పీఏసీఎస్‌లకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటంతో చైర్మన్ కనుసన్నల్లో యూరియా వారి పార్టీకి చెందిన వారికి, పెద్ద రైతులకు దొడ్డిదారిన ఇస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పంట పొట్టదశకు చేరిందని ఇప్పటికీ యూరియా పూర్తిస్థాయిలో అందకపోవటం విచారకరమని పేర్కొన్నారు. దీనికి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బదులిస్తూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని, అయితే తొలి పంట వర్షాలకు దెబ్బతినటంతో మళ్లీ నాట్లు వేశారని, ముంపు బారిన పడిన పొలాలు మళ్లీ ఊడ్చారని దీంతో యూరియా మళ్లీ అవసరం కావటంతో కొరత ఏర్పడినట్లు క్షేత్రస్థాయి పర్యటనలో తన దృష్టికి వచ్చిందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే కొంత చేరిందని, మరికొంత రానున్న రోజుల్లో చేరుతుందన్నారు.
● 2024 ఆగస్టులో తువ్వకాలువకు వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వరకు 20 గండ్లు పడి దాదాపు 2 వేల ఎకరాలకు పైగా భూమి సాగు కావటం లేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీతో పాటు పలువురు జెడ్పీటీసీలు పేర్కొ న్నారు. ఈ గండ్లు పూడ్చేందుకు రూ.1.60 కోట్లను మంజూరు చేసినా, పనులు చేపట్టకపోవటంతో ఇప్పటికీ మూడు పంటలను రైతులు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. గండ్లకు సంబంధించిన ఫొటోలతో మేట వేసిన పొలాల ఫొటోలను వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ వారికి హామీ ఇచ్చారు.
● జెడ్పీటీసీ, ఎంపీపీలకు కూటమి ప్రభుత్వ పాలనలో అధికారులు ప్రొటోకాల్ ప్రాధాన్యం ఇవ్వటం లేదని సభ్యులు కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకువచ్చారు. శిలాఫలకాలపై వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీల పేర్లు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు ఫొటోలను జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ బాలాజీలకు చూపించారు. ఇకపై నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
● భోజన విరామం జరిగిన అనంతరం సభలో పంచాయతీరాజ్ డీఈ నగేష్ తాము జిల్లా కలెక్టర్‌కు శిలాఫలకం ప్రొటోకాల్‌ను పంపుతామని ఆయన అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాటిని పెడుతున్నామని పేర్కొన్నారు. జేసీ గీతాంజలిశర్మ కలుగజేసుకుని ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని ఇకపై ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
● రెండు నెలల కిందట గుడివాడలో జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రథమ మహిళకే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని కలెక్టర్ బాలాజీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాలాజీ.. ఎస్పీ గంగాధరరావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును తాను కూడా పర్సనల్‌గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సభ్యులకు హామీ ఇచ్చారు.
జిల్లాలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ సమస్యలను లేవనెత్తేందుకు నిర్వహించే ప్రధాన సమావేశమైన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటం పట్ల తాము అధికారులకు మాత్రమే చెప్పుకోవాల్సి వస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న జెడ్పీ సమావేశానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరుకాకపోవటం గమనార్హం.
14 నెలలుగా గౌరవవేతనం రావటం లేదని, ఇది త్వరితగతిన ఇప్పించాలని జెడ్పీటీసీ, ఎంపీపీలు కలెక్టర్‌ను కోరారు. గౌరవవేతనం రాకపోవటంతో మండల పరిషత్ సమావేశాలకు ఎంపీటీసీ సభ్యులు హాజరుకామని చెబుతున్నారని, ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీటీసీలకు జెడ్పీ నిధుల నుంచి గౌరవ వేతనం చెల్లించేలా సమావేశంలో తీర్మానించారు.
నందిగామ మండలం రాఘవాపురంలో అక్రమ మట్టి తోలే క్రమంలో ఆపరేటర్, లారీ డ్రైవర్ మట్టి కింద పడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేయించాలని కంచికచర్ల, నందిగామ జెడ్పీటీసీలు వేల్పుల ప్రశాంతి, జి. వెంకటేశ్వరరావు తదితరులు అధికారులను కోరారు.
విద్యపై జరిగిన చర్చలో తల్లికి వందనం పథకం ద్వారా చాలా మండలాల్లో తల్లులకు రూ. 6వేలు, 7వేలు మాత్రమే పడ్డాయని కొంత మందికి అసలు పడలేదని దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు డీఈవో రామారావును కోరారు.
సమావేశంలో నూజివీడు సబ్‌కలెక్టర్ బి. వినూత్న, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

సర్కారు తమాషా