
పోలీసు కుటుంబాలకు అండగా పోలీసుశాఖ
జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ తరఫున మంజూరైన బీమా చెక్కులను గురువారం జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అకాల మరణాలు పోలీసు శాఖకు తీరని లోటు అని అన్నారు. సిబ్బంది వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం రుణాలు తీసుకోవడం సర్వసాధారణం అని, అలా తీసుకున్న రుణాలను బీమా ద్వారా మాఫీ చేస్తామన్నారు. సిబ్బంది సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.దాసు కుటుంబానికి రూ.5,32,495, హెడ్ కానిస్టేబుల్ బి.వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.2,08,700, కె.వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ. 1,80,143 బీమా చెక్కులను అందజేసినట్టు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాఘవయ్య, కృష్ణాజిల్లా పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు జీవీ శేషగిరిరావు, కార్యదర్శి సీహెచ్ చెన్నకేశవులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.