
యువత క్రీడలు, ధ్యానంపై దృష్టి పెట్టాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత క్రీడలు, ధ్యానం మీద దృష్టి పెట్టి ప్రకృతితో మమేకం అవ్వాలని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ఎస్వీ రమణ సూచించారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవమైన గ్రామోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం కేఎల్ యూనివర్సిటీలో జరిగాయి. ఆమె మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషి హర్షణీయమని కొనియాడారు. గౌరవ అతిథి కేఎల్ విశ్వవిద్యాలయం క్రీడల సంచాలకుడు డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ప్రత్యేక అతిథి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ పరిపాలన అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో గ్రామీణ యువతకు నూతన ప్రోత్సాహం అందుతుందన్నారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వాలీబాల్ (పురుషులు) రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు) రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
ఆటల పోటీల్లో ఉత్సాహాంగా పాల్గొన్న మహిళలు