గత ఏడాది వరదలకు ధ్వంసమైన చెర్వుమాధవరం ఎత్తిపోతల పథకం శిథిలాలను తొలగించి మోటార్లను భద్రపరచని అధికారులు నీళ్లున్నా ఎత్తిపోయలేని స్థితిలో ఎత్తిపోతల పథకం బూడిదలో పోసిన పన్నీరులా రూ.1.30 కోట్ల ప్రజాధనం
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు పులివాగుపై ఉన్న చెర్వుమాధవరం ఎత్తిపోతల పథకం పూర్తిగా ధ్వంసమైంది. ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన షెడ్డు కూలిపోయి శిథిలాల కిందనే మోటార్లు ఉన్నాయి. ఏడాది గడిచినా ఈ ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు చేసేందుకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్న విలువైన మోటార్లు, స్టార్టర్ బోర్డులు, పైపులను అక్కడి నుంచి తొలగించి భద్రపరచలేదు. రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఎత్తిపోతల పథకాన్ని చూస్తే అర్ధమైపోతుంది.
నిర్మాణం ఇలా...
వర్షాకాలంలో పులివాగులో ప్రవహించే వరద ప్రవాహం బుడమేరులో కలిసి వృథాగా పోతుంది. ఈ క్రమంలో ఎటువంటి నీటి వనరులేని చెర్వుమాధవరం గ్రంథివాని చెరువుకు నీటిని సరఫరా చేసేందుకు గడ్డమణుగు గ్రామ శివారులో పులివాగుపై ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1.30 కోట్లతో 2014–19 మధ్య కాలంలో నిర్మించారు. ఈ పథకం నిర్మించిన ప్రదేశంలో చెక్ డ్యామ్ కూడా ఉండడంతో వర్షపు నీరు నిల్వ ఉండి ఎత్తి పోసేందుకు వీలుంటుందని భావించి నిర్మించారు. అయితే వర్షాలు వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో నీటి సదుపాయం ఉండని పులివాగు మీద ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకం చెరువును నింపకపోయినప్పటికీ పులివాగులో నీరున్న సమయంలో నీళ్లను చెరువులోకి సరఫరా చేయడం ద్వారా ఆయకట్టు భూముల్లోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజనం కలిగేది.
ఏడాదిగా నిర్లక్ష్యం
ఈ ఎత్తిపోతల పథకం గత ఏడాది ఆగస్టులో పులివాగుకు వచ్చిన వరద ప్రవాహానికి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ తర్వాత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో నేటికీ అలాగే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.1.30 కోట్ల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిథిలాలను తొలగించి, మోటార్లను మరమ్మతులు చేసి, ఎత్తిపోతల పథకాన్ని పునఃనిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న క్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద వర్షం నీరు నిల్వ ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
ఇలా చేస్తే ప్రయోజనం
చెర్వుమాధవరం పక్కనే ఉన్న గడ్డమణుగు గ్రామ శివారు వరకు ఉన్న తారకరామా ఎత్తిపోతల పథకంలోని నాల్గవ పంపు హౌస్ నుంచి నీటిని పులివాగులోకి తరలించాలి. పులివాగు వద్ద ధ్వంసమైన ఎత్తిపోతల పథకాన్ని వాడుకలోకి తీసుకొస్తే గ్రంథివాని చెరువుకు పుష్కలంగా నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. దీనితో పాటు ఈ చెరువు కింద ఉన్న కాల్వలు సైతం ఇప్పటికే ఆక్రమణలకు గురైన నేపథ్యంలో కాల్వలను ఏర్పాటు చేస్తే రైతులకు సాగునీటి సమస్య తీరిపోతుంది. ఈ చెరువుకు నీటి వసతి కల్పించి రిజర్వాయర్‌గా మార్చగలిగితే చెరువుకింద ఆయకట్టుగా ఉన్న 160 ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుంది. అంతే కాకుండా సమీప గ్రామాలైన సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి బెట్ట సమయంలో బోర్లలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఏడాదైనా ఎత్తిపోతలపై వీడని నిర్లక్ష్యం