
15 నాటికి అన్ని పనులు పూర్తి కావాలి
దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దసరా ఉత్సవ, అభివృద్ధి పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన అన్ని పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు వేగవంతం కావాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చేపట్టిన దసరా ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు నిర్మించిన బీటీరోడ్డును పరిశీలించారు. క్యూకాంప్లెక్స్‌ను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మహా మండపం పక్కనే నిర్మాణంలో ఉన్న లడ్డూ పోటును పరిశీలించి భవన డ్రైనేజీ వ్యవస్థ గురించి ఆరా తీశారు. డ్రైనేజీ నిర్మాణంలో ఎటువంటి అలసత్వం వద్దని, భవష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాజగోపురం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనాన్ని పరిశీలించారు. కొండపై నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని, యాగశాలను పరిశీలించి మిగిలిన పనులు ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు.