
ప్రతి సమస్యకు పరిష్కారం
మీకోసంలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: మీకోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసం కార్యక్రమమని, న్యాయం కోరే బాధితులు ధైర్యంగా తమ సమస్యను విన్నవించుకోవచ్చని అన్నారు. మీకోసం దృష్టికి వచ్చిన ప్రతి అర్జీని చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 42 అర్జీలు అందినట్లు తెలిపారు.
మీకోసంలో ప్రధానంగా వచ్చిన అర్జీలు
బంటుమిల్లి నుంచి వెంకట్రావు అనే వృద్ధుడు ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకున్నాడు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా, ఇటీవల తన భార్య కూడా మరణించిందని చెప్పాడు. అయితే మిగిలిన తన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు కలిసి తన వద్ద ఉన్న బంగారం, డబ్బును బలవంతంగా లాక్కోవటమే కాకుండా తన ఆస్తిని కూడా వారికి రాయాలని శారీరకంగా హింసించినట్లు వాపోయాడు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.
కోడూరుకు చెందిన కల్పన అనే వివాహిత ఎస్పీని కలిసి తన గోడు విన్నవించుకుంది. తనకు వివాహం జరిగి ఆరేళ్లయిందని, భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారంటూ వాపోయింది. కుటుంబ పెద్దలతో మాట్లాడించినా ప్రయోజనం లేదని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ప్రాధేయపడింది.
అవనిగడ్డకు చెందిన వీరయ్య అనే బాధితుడు ఎస్పీని కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు. తన సమీప బంధువునికి కుటుంబ అవసరాల నిమిత్తం కొంత నగదు అప్పుగా ఇచ్చానని, సంవత్సరం గడుస్తున్నప్పటికీ డబ్బు ఇవ్వకపోగా ఇచ్చిన అప్పు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరాడు.
కంకిపాడుకు చెందిన రామారావు తన సమీప బంధువులు తనను మోసం చేశారని వాపోయాడు. తన ఆస్తికి సంబంధించిన పత్రాలపై సంతకాలను ఫోర్జరీ చేసి తమ సమీప బంధువులు వారి పేర రాయించుకున్నారని, జరిగిన మోసాన్ని నిలదీస్తుంటే తనను దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరాడు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.