
యూరియాపై ఎలాంటి ఆందోళన చెందొద్దు
అవసరానికి తగ్గట్లుగా సరఫరా చేస్తున్నాం కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అవసరానికి తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెప్టెంబరు 1 నుంచి నేటి వరకు 3,180 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, సోమవారం రాత్రికి 1371 మెట్రిక్ టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇంకొక 1200 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. యూరియా కష్టాలపై అధ్యయనం చేసేందుకు ఆదివారం వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశీలన చేసి రైతులతో మాట్లాడారని చెప్పారు. అనంతరం తాను జిల్లాకు అదనంగా 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని కోరానని, అందుకు ఆయన అవసరమైన యూరియాను సరఫరా చేసేందుకు అంగీకరించారన్నారు. రానున్న పదిరోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.