
రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యం
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ తన కార్యకలాపాలను సాగిస్తుందని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డైరెక్టర్ల సమావేశం సోమవారం బోర్డు మీటింగ్ హాల్‌లో నిర్వహించారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. అనంతరం చలసాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన హనుమాన్ జంక్షన్‌లో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1210 కోట్లు టర్నోవర్ సాధించామని, 29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామన్నారు. కృష్ణామిల్క్ యూనియన్‌లో రూ.230 కోట్లు రిజర్వ్ నిధులు ఉన్నాయన్నారు. బుడమేరు ముంపు యూనియన్‌ను తీవ్రంగా నష్టపరిచినా పాడి రైతులకు రూ.46 కోట్లు బోనస్‌గా చెల్లించామని, అదే సమయంలో రూ.16 కోట్ల సంక్షేమ పథకాలను కూడా అమలు చేశామన్నారు. గడిచిన ఆరేళ్లలో పాల దిగుబడిని పెంచేలా యూనియన్ నాణ్యమైన పశుదాణాను సబ్సిడీపై అందిస్తోందన్నారు. విజయ పార్లర్ ద్వారా డ్వాక్రా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డైరెక్టర్లు చలసాని చక్రపాణి, నెలకుదిటి నాగేశ్వరరావు, వేమూరి వెంకట సాయిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.