
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కంచికచర్ల: వినాయక నిమజ్జన సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వర్గం ఫిర్యాదే తీసుకుంటారా అని దళితులు పోలీసులను ప్రశ్నించారు. తమ వర్గం ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని వారు ఆదివారం రాత్రి కంచికచర్ల పీఎస్ ఎదుట ఆందోళన చేశారు. పరిటాల దళితవాడలో శనివారం నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల్లో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు ఒక వర్గం వారిపై కేసు నమోదు చేశారు. తమ వర్గంలో ఉన్నవారికి కూడా దెబ్బలు తగిలాయని వారిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీస్‌స్టేషన్ వద్ద దళితులు ఆందోళన చేశారు. ఆందోళనకారుల వద్దకు సీఐ చవాన్‌దేవ్, ఎస్‌ఐ విశ్వనాఽథ్ వెళ్లి గ్రామంలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని రెండో వర్గంపై కూడా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు.