
అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
జగ్గయ్యపేట అర్బన్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్‌ఐ జి.రాజు మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడిన నేరస్తుడిని, దోపిడీ చేసిన బంగారు, వెండి నగలను మీడియా ముందు హాజరుపరిచారు. ఎస్‌ఐ రాజు మాట్లాడుతూ నందిగామ ఏసీపీ తిలక్ పర్యవేక్షణలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ జి.రాజు, ఎన్టీఆర్ జిల్లా సీసీఎస్ పోలీసులు, నందిగామ, జగ్గయ్యపేట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతికతను ఉపయోగించి విచారణ చేశారన్నారు. జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో అంతర్రాష్ట్ర నేరస్తుడు శీలంశెట్టి వెంకటరమణను హైదరాబాద్‌లో శనివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ జనగాం జిల్లా రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన నేరస్తుడిపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇతని నుంచి రూ.6 లక్షల విలువైన సుమారు 85 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు.
రూ.6 లక్షల విలువైన నగలు స్వాధీనం