
ఆటో కార్మికులను పట్టించుకోని కూటమి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల ఆకలి కేకలు పట్టించుకోవడం లేదని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్టూ) ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఇఫ్టూ ఆధ్వర్యాన.. హామీలు అమలు చేయాలని కోరుతూ ధర్నా జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం హామీలు చేయడం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తామని 15 నెలలు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు. అధిక పెనాల్టీలు వేసే జీవో 21 రద్దు, కార్మికులకు సంక్షేమ బోర్డు వంటి హామీల ఊసెత్తడం లేదన్నారు. ర్యాపిడ్, ఓలా, ఊబర్ బైక్ సర్వీస్‌లు ప్రమాణాలు పాటించకుండా సర్వీస్ కంపెనీలు తమ ఆదాయం పెంచుకుంటూ ఆటోవాలాల పొట్ట కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇంధనం, సీఎన్‌జీని ఆటో కార్మికులకు అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై ఈ నెల 18న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇప్టూ జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, నగర అధ్యక్షుడు రవీంద్ర, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి ఆర్.కనకరావు, నాని, అర్జున్, సత్యనారాయణ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
భారత కార్మిక సంఘాల సమాఖ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ