
ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ధాన్యం సేకరణ కార్యక్రమానికి సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్‌తో కలిసి ధాన్యం సేకరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సోమవారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఖరీఫ్ సీజన్‌కు గానూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ప్రతి క్వింటాలు ధాన్యం సాధారణ రకం రూ.2,369 చొప్పున, గ్రేడ్–ఎ రకానికి రూ.2,389 చొప్పున మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. జిల్లాలోని రైతులందరూ పండించిన ధాన్యాన్ని నాణ్యత, ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకుని తీసుకురావాల్సిందిగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 30 శాతం ఈ–పంట నమోదైందని, నూరు శాతం ఈ–పంట నమోదు, ఈ–కేవైసీ పూర్తి చేయాలని కోరారు. మిల్లర్ల వద్ద ఉన్న తేమశాతం పరిశీలించి యంత్ర పరికరాలను సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదో పరీక్షించాలని తెలిపారు. గోనెసంచులు, హమాలీ, రవాణా సౌకర్యాలకు ఎక్కడా కొరత లేకుండా కావాల్సినంత ముందస్తుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా కొనుగోలు సమాయత్తం కావాన్నారు. ధాన్యం రవాణా చేసే అన్ని వాహనాలకు జీపీఎస్‌ను ముందుగానే అమర్చాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామప్రసాద్, డీఎస్‌వో మోహనబాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్ పద్మావతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, డీటీసీ మురళీధర్, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, డీసీవో చంద్రశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.