
సరోగసీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికతతో సరోగసి(అద్దె గర్భం) ద్వారా బిడ్డలను పొందడానికి చట్టపరంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. దంపతులకు సంతానం లేనప్పుడు, వారి బిడ్డను మరొక మహిళ తన గర్భంలో పెంచి , తర్వాత వారికి అప్పగించే విధానాన్ని సరోగసి, దత్తత గర్భధారణ అని కూడా అంటారని తెలిపారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ప్రకారం వాణిజ్య పరమైన సరోగసీ నిషేధించినట్లు తెలిపారు. కేవలం పరోపకార సరోగసి మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. సరోగసీ ద్వారా బిడ్డలు పొందాలనుకునే దంపతులు తప్పనిసరిగా భారతీయులైన ఉండాలని, విదేశీయులు, సింగిల్ పురుషులు ఈ సరోగసీకి అర్హులు కాదన్నారు. సరోగేట్ మదర్ 21–35 ఏళ్లు మధ్య వయస్సుతో పాటు, కనీసం ఒక బిడ్డను కలిగి ఉండాలని తెలిపారు. తన జీవితంలో రెండు సార్లు మాత్రమే సరోగేట్ తల్లిగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వాణిజ్య లాభం కోసం చేస్తే జైలుశిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని, అద్దె గర్భం పొందేందుకు ముందు సరోగేట్ మదర్ నుంచి రాత పూర్వక అంగీకారం తీసుకోవాలని సూచించారు. ఈ పక్రియలో లైంగిక ఎంపిక నిషేధమని, అద్దె గర్భం ఇచ్చు తల్లి పిల్లలు ఆరోగ్య పరిరక్షణకు నియమ నిబంధనలు ఉన్నట్లు తెలిపారు.