ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రి దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల సమయంలో కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేసే కళావేదికపై కళాకారులు తమ నృత్యాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకు గాను కళాకారుల నుంచి దేవస్థానం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటికే పలువురు కళాకారులు తమ దరఖాస్తులను సమర్పించగా, ఆసక్తి కలిగిన కళాకారులు, నృత్యకారులు తమ దరఖాస్తులను అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం నాల్గో అంతస్తులో సమర్పించవచ్చు. కళాకారులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలన అయిన అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు.
భక్తులకు మెరుగైన దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో భక్తులకు మెరుగైన దర్శనంతో పాటు వారికి సకల సదుపాయాలను కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో శీనానాయక్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడికి చేరుకున్న అధికారులు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఏర్పాట్లపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీఎంసీ కార్యాలయం ఎదుట భక్తుల హోల్డింగ్ పాయింట్‌తో పాటు త్వరలో ఖాళీ కానున్న ఫ్లవర్ మార్కెట్‌ను రెండో హోల్డింగ్ పాయింట్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అనంతరం రథం సెంటర్, దుర్గాఘాట్, చైనా వాల్ వద్ద ఏర్పాట్ల గురించి చర్చించారు. కనకదుర్గనగర్ ప్రసాదాల కౌంటర్లు, ప్రసాదాల పోటు భవనం, అన్నదానం భవనం పనులను పరిశీలించారు. ఉత్సవాల నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని దుర్గగుడి ఈవో శీనానాయక్ అధికారులకు తెలిపారు.
పీఏసీఎస్ చైర్మన్లకు శిక్షణ తరగతులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీఏసీఎస్ చైర్మన్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. సోమవారం విజయవాడ బందరు రోడ్డులోని కేడీసీసీ ప్రాంతీయ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో మైలవరం, విజయవాడ రూరల్, పెనమలూరు, పామర్రు, గన్నవరం పరిధిలోని పీఏసీఎస్‌ల చైర్మన్లు 80 మంది పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమ ప్రారంభ సభలో నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ పీఏసీఎస్‌ల కంప్యూటరైజేషన్ పూర్తయిందన్నారు. ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ అవగాహన కూడా తప్పనిసరిగా ఉండాలన్నారు. అందుకే చైర్మన్లకు నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. కేడీసీసీ బ్యాంకు సీఈఓ శ్యామ్ మనోహర్, జీఎం రంగబాబు, చంద్రశేఖర్, ఆప్కాబ్ సిబ్బంది పాల్గొన్నారు.