కంకిపాడు: బైక్ అదుపుతప్పిన సంఘటనలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు...గుడివాడ పట్టణానికి చెందిన షేక్ ఖాజా (23) సోమవారం తెల్లవారుజామున మోటరు సైకిల్‌పై గుడివాడ నుంచి కానూరు వస్తుండగా కోమటిగుంట లాకులు దాటిన తరువాత బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో గాయపడ్డ ఖాజాను మెరుగైన వైద్యం నిమిత్తం ఉయ్యూరుకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాజా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
బైక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి...
బైక్ అదుపుతప్పిన సంఘటనపై మరో వ్యక్తి మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు...విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన కొలుసు సుబ్బారావు (45) ఈనెల 19న గుడివాడ నుంచి పునాదిపాడు వచ్చి, గూడవల్లి గ్రామానికి వెళ్లే క్రమంలో సుబ్బారావు నడుపుతున్న బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో గాయపడ్డ సుబ్బారావును మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఘటనపై ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అసభ్య ప్రవర్తన కేసులో నిందితుడికి జైలు
ఇబ్రహీంపట్నం/విజయవాడలీగల్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పోక్సో కోర్టు జడ్జి వి.భవాని నిందితుడికి ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా సోమవారం విధించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... 2019 డిసెంబర్ 18న పోలీస్ స్టేషన్ పరిధిలో అనాథ పిల్లలకు ఫండ్ కలెక్ట్ చేసేందుకు వచ్చిన ఓ బాలికను మూలపాడు గ్రామానికి చెందిన బడుగు పాపారావు డబ్బులు ఇస్తాను అని ఇంట్లోకి తీసుకెల్లి మంచంపై పడేసి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక అతన్ని తోసేసి బయటకు వచ్చి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ.శ్రీను కేసు దర్యాప్తు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం 8 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితుడిపై నేరం రుజువుకావడంతో జైలు శిక్ష, జరిమాన విధించింది. బాధిత బాలికకు రూ.50 వేలు పరిహారం వచ్చేలా చూడాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ఆధారిటీని ఆదేశించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
చెల్లని చెక్కు కేసులో...
చిలకలపూడి(మచిలీపట్నం):చెల్లని చెక్కు కేసులో కార్పొరేషన్ ఉద్యోగికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. సాయిసుధ సోమవారం తీర్పు చెప్పారు. మచిలీపట్నంకు చెందిన తాడిశెట్టి వెంకటకృష్ణారావు వద్ద నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కళా కేశవ అనే ఉద్యోగి 2020 జనవరి 5వ తేదీన కుటుంబ అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్మానం నిమిత్తం 2021 జూన్ 21వ తేదీన రూ.4 లక్షలు ఆంధ్రాబ్యాంక్ చెక్కును అందజేశారు. ఆ చెక్కును వెంకటకృష్ణారావు మచిలీపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు వసూలు నిమిత్తం దాఖలు చేయగా నగదు లేదని తిరస్కరించారు. దీనిపై కేశవకు కృష్ణారావు నోటీసు పంపినా స్పందించకపోవటంతో కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి సాయిసుధ పై విధంగా తీర్పు ఇచ్చారు.