కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి | - | Sakshi
Sakshi News home page

కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి

Jul 18 2025 4:52 AM | Updated on Jul 18 2025 4:52 AM

కూటమి

కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీనికి నిదర్శనం ఈ ఏడాది ఒకటో తరగతిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 200 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో అడ్మిషన్‌ ఉండటమే. గత ఏడాది నుంచి కూటమి పాలకులు అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు తగ్గుతున్నాయి. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చడానికి ముందుకు రావడం లేదు. సాధారణంగా జూన్‌లోనే అడ్మిషన్ల హడావుడి కనిపిస్తుంది. కానీ జూలై 15 దాటినా వందల సంఖ్యల్లోని పాఠశాలల్లో చేరికలు లేకపోవటంతో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంస్కరణల పేరుతో గందరగోళం

కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యా శాఖలో గందరగోళం సృష్టిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులను బడికి దూరం చేయడం, సకాలంలో ఉపాధ్యాయుల భర్తీ చేయకపోవడం వంటి కారణాలతో సర్కారు బడుల్లో పిల్లల చేరిక తగ్గుతోందంటున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో వందలాది పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా కొత్తగా చేరకపోవడం ఆందోళనకర విషయంగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం మోడల్‌ ప్రైమరీ పాఠశాల పేరుతో విద్యార్థులకు బడిని దూరం చేస్తోందని, దీంతో వారు ప్రైవేటు బడి బాట పడుతున్నారని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని కూటమి ప్రభుత్వం చెబుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పలువురు వివరిస్తున్నారు.

అడ్మిషన్లపై వసతుల ప్రభావం

వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి విద్యారంగాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దారు. గత ప్రభుత్వం నాడు–నేడు పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయా పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అదే క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెండో విడత చేపట్టిన పనులు ఎన్నికల ఫలితంగా మధ్యలో నిలిచిపోయాయి. అనేక చోట్ల అదనపు తరగతి గదులు కూడా పూర్తికాలేదు. కేవలం 40 నుంచి రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తే కనీసం 300 విద్యాసంస్థల్లో వందలాది తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపడం లేదని పలువురు విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 200 ప్రభుత్వ బడుల్లో జీరో అడ్మిషన్‌ పాఠశాలల్లో వసతులపై శ్రద్ధ ఏదీ! పట్టించుకోని పాలకులు పిల్లలను చేర్చడానికి ముందుకు రాని తల్లిదండ్రులు

పాలకుల నిర్లక్ష్యమే కారణం

పాలకుల నిర్లక్ష్యమే పాఠశాలలను పేదలకు దూరం చేస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద సంఖ్యలో పాఠశాలల్లో జీరో అడ్మిషన్‌ చోటు చేసుకోవడం దారుణం. బదిలీలు, విలీనాల పేరుతో గందరగోళాలను సృష్టించారు. చాలా పాఠశాలల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. వసతులు లేకపోవడంతో పిల్లలను చేర్చటానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.

–సీహెచ్‌ వెంకటేశ్వర్లు,

కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా

విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం

ఉమ్మడి కృష్ణాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల సంఖ్య 3,242 వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 2200 పైచిలుకు ఉన్నాయి. ఏటా ఒకటి, ఆరో తరగతుల్లోనే ప్రధానమైన అడ్మిషన్లు జరుగుతుంటాయి. మిగిలిన తరగతుల్లోకి ఒకటి రెండు అడ్మిషన్లు జరిగినా ప్రధానంగా ఆ రెండు తరగతుల్లోనే చేరికలు ఉంటాయి. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 200 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క అడ్మిషన్‌ సైతం జరగలేదని అధికార నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా కృష్ణాజిల్లాలో సుమారు 150కు పైగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఒక్కటి కూడా జరగలేదని అధికార నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై కలెక్టర్‌ సైతం విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది.

కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనకంజ వేస్తున్నారు. పాఠశాలల విలీనం, ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయడం అనేక కారణాలతో పేదలకు పాఠశాలలను దూరమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది

– ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,

వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం

కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి 1
1/2

కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి

కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి 2
2/2

కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement