
ఊపిరి...ఉఫ్!
తెలిసీ తెలియని వయసులో యువకులు సరదాగా చేసుకున్న అలవాటు వారికి జీవితకాలపు వ్యసనంగా తయారవు తోంది. వారి ఆయుర్దాయాన్ని సగానికి సగం తగ్గించేస్తుంది. ఒక్కో సిగరెట్ జీవితకాలంలో ఒక్కో నిమిషాన్ని తగ్గిస్తుంది. ప్రాణాంతక వ్యాధులకు గేట్లు తెరిచి ఆహ్వానం పలుకుతుంది. నిండు జీవితాన్ని ఉఫ్‌న ఊదేస్తుంది.
● ధూమపానం ప్రాణాంతక వ్యాధులకు ఆహ్వానం ● మనిషి జీవిత కాలాన్ని తగ్గించేస్తున్న సిగరెట్ ● ఏటా పెరుగుతున్న పొగాకు బాధితులు ● గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, రక్తపోటుకు దారితీస్తున్న వైనం
ఎలా మానవచ్చు...
● సిగరెట్ తాగాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక గంట వాయిదా వేసుకోండి. అలా చేస్తే రోజు మొత్తంలో తాగే సిగరెట్ల సంఖ్య కొంతవరకై నా తగ్గించుకోవచ్చు.
● బాగా సిగరెట్ తాగాలనిపించినప్పుడు నిలబడి లేదా కూర్చుని లోతైన శ్వాస తీసుకోండి. అప్పుడు ఓ గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
● సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు కళ్లెదుట దృష్టిలో పడకుండా ఉంచండి.
● సిగరెట్ తాగాలనిపించినప్పుడు నోట్లో చూయింగ్ గమ్, ఏదైనా స్వీట్, పిప్పర్ మెంట్ లాంటివి పెట్టుకుని, లోతైన శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
● పౌష్టికాహారం తీసుకోవడం వలన పొగ తాగడానికి ఆకర్షితులవ్వం.
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో ధూమపానం చేసేవారే అధికంగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ధూమపానం చేసే వారిలో దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులు కూడా సరిగా పనిచేయవంటున్నారు. అలాంటి ధూమపానం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేటి సమాజంలో ఫ్యాషన్ కోసం కొంతమంది సిగరెట్ తాగడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. టీవీల్లో వచ్చే ప్రకటనలు, సినిమాల్లో హీరోలను అనుసరిస్తూ చాలా మంది యువకులు పొగతాగడం అలవాటు చేసుకుంటున్నారన్నది వాస్తవం.
ఏటా పెరుగుతున్న బాధితులు
పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతిఏటా 30 వేల మంది వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిలో ఎక్కువగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, లివర్, శ్యాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. లంగ్, గొంతు క్యాన్సర్ బాధితులు ఇటీవల జిల్లాలో పెరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కారణంగా పొగ పీల్చే వారు సైతం పలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ధూమపానం కారణంగా నమోదైన క్యాన్సర్ కేసుల్లో 10 శాతం మందిలో సిగరెట్ తాగకపోయినా పొగ పీల్చడమే కారణంగా బాధితులవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంపై చట్టం వచ్చినా అది అమలుకు నోచుకోవడం లేదు.
ధూమపానంతో వచ్చే రుగ్మతలివే...
● పొగతాగడం వలన శరీర భాగాలైన గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రపిండాల క్యాన్సర్ సోకే అవకాశం ఉంది.
● గుండె రక్తనాళాలు బిరుసుగా మారి హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది.
● నాడీ సంబంధ వ్యాధులు, పక్షవాతంకు దారి తీస్తుంది.
● మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలకు కారణం
● దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై ప్రభావం చూపుతుంది.
● పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ల సంఖ్య తగ్గి, రుతుక్రమం త్వరగా నిలిచిపోతుంది
● శారీరక సామర్ధ్యం, ఎముకల పటుత్వం తగ్గుతుంది.
మందులు పనిచేయవు
ధూమపానం చేసేవారిలో మందులు పనిచేయని పరిస్థితి నెలకొంటుంది. దీంతో మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ధూమపానం చేస్తే మందులు వాడినా అదుపులోకి రావడం కష్టంగా మారతుంది. రక్తంలో మూడు నెలల చక్కెర స్థాయిలు(హెచ్‌బీఎ1సీ) 7శాతం కంటే తక్కువ ఉండాలి. కానీ రక్తంలో నికోటిక్ కలవడం వలన మరో 3 నుంచి 4 శాతం అధికంగా ఉంటుంది. ధూమపానం చేసేవారిలో మధుమేహం కారణంగా వచ్చే దుష్ఫలితాలు అధికంగా ఉంటాయి. కంటి రెటీనా సమస్యతో పాటు, సైలెంట్ హార్ట్‌ఎటాక్, పక్షవాతం, కిడ్నీల సమస్యలు తలెత్తుతాయి.పాదాలకు పుళ్లు పడి తగ్గని పరిస్థితి ఉంటుంది.
–డాక్టర్ టీవీ మురళీకృష్ణ,
ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్

ఊపిరి...ఉఫ్!