
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులకు ఐఐటీ సీట్లు
విస్సన్నపేట: అతి సాధారణ రైతు కుటుంబంలో నుంచి ఇద్దరు సోదరులు ఐఐటీలో సీట్లు సాధించి గర్వకారణంగా నిలిచారు. విస్సన్నపేటకు చెందిన నెక్కళపు సూర్యనారాయణ, అంజమ్మ దంపతుల చిన్న కుమారుడు చిట్టిబాబు హైదరాబాద్‌లో సీబీఐ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. చిట్టిబాబు, సునీత దంపతుల చిన్న కుమారుడు దీపక్ చౌదరి 2025 జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 8,380 ర్యాంకు సాధించి ఐఐటీ పాలకడ్‌లో బీటెక్ ఇన్ డేటాసైన్స్‌లో సీటు సాధించాడు. అతని అన్న పవన్ సూర్య 2023లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 903 ర్యాంక్ సాధించి ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో సీటు సాధించాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ము లు ఐఐటీలో సీట్లు సాధించినందుకు గ్రామంలో పలువురు వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
జంట హత్యల కేసులో నిందితుడు అరెస్టు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చంపి పారిపోయిన రౌడీషీటర్ జమ్ము కిషోర్‌ను గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ గవర్నర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ భవనంలో అద్దెకు ఉంటూ కేటరింగ్ పనులు చేసే ఇద్దరు వ్యక్తులు బుధవారం హత్యకు గురైన విషయం విదితమే. కొత్తపేట స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ జమ్ము కిషోర్ మద్యం మత్తులో ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీ సులు నిర్థారణకు వచ్చారు. పూటుగా మద్యం తాగి రాజు, వెంకట్ అనే ఇద్దరితో గొడవ పడి వారిద్దరినీ కత్తితో పొడిచి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు అతని కోసం ఏడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని స్నేహితులు, పాత నేరస్తుల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా నిందితుడు సికింద్రాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు కిషోర్‌ను అరెస్టుచేసి విజయవాడ పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. ఇదిలావుండగా హత్యకు గురైన రాజు, వెంకట్ మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించారు. కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అతని నుంచి హత్యకు గల కారణాలు, ఒకడే హత్య చేశాడా? ఇంకా ఎవరైనా సహకరించారా తదితర సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.