
గాయాలైన విద్యార్థులకు చికిత్స చేస్తున్న దృశ్యం
మద్యం మత్తులో కారు నడిపిన వైనం
నలుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు
దెబ్బతిన్న మరో రెండు కార్లు
సాక్షినెట్‌వర్క్(విజయవాడ): బెంజిసర్కిల్ వద్ద గురువారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడిపే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో ముందు వెళ్లే రెండు కార్లను ఢీకొట్టి, రోడ్డు పక్కన ఉన్న మరో నలుగురు విద్యార్థినులను ఢీకొట్టగా వారికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బెంజిసర్కిల్ సమీపంలోని క్రోమా షోరూమ్ వద్ద జనం రద్దీగా ఉన్న సమయంలో ఓ కారు వేగంగా దూసుకు వచ్చింది. ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టి, రోడ్డు పక్కన ఉన్న కళాశాల విద్యార్థినుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆ రెండు కార్లు దెబ్బతినగా నలుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను పటమటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి పూటుగా మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదలు
మద్యం మత్తులో కారు నడిపి నలుగురు విద్యార్థులను గాయపరిచిన న్యూ ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్లి ఆదినారాయణకు పటమట పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదలు చేస్తున్నారు. ఆయన నగరంలోని ఓ ఏసీపీకి బాగా కావాల్సిన వ్యక్తి కావడంతోనే అలా చేస్తున్నారని బాధితులు అంటున్నారు. అంతేకాదు మద్యం మత్తులో కారు నడిపిన అతన్ని తప్పించి మరో డ్రైవర్‌పై కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సామాన్య ప్రజలు మద్యం తాగి పట్టుబడితే రూ.10వేలు, రూ.15 వేలు జరిమానాలు వేసే పోలీసులు, తమకు తెలిసిన వారైతే, మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించినా స్టేషన్‌లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
పాయకాపురం(విజయవాడరూరల్): పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపం చెందిన భర్త సలాది సురేష్ (36)గురువారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు, వాంబే కాలనీ డోరు నంబరు 270, ఎఫ్ బ్లాక్‌కు చెందిన సలాది సురేష్‌కు ఉయ్యూరుకు చెందిన మహిళతో 2022లో వివాహం జరిగింది. వీరికి సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య కలహాలు రేగాయి. ఈ నేపథ్యంలో సురేష్ భార్య గత ఫిబ్రవరిలో పుట్టింటికి వెళ్లింది. పెద్దలను పంపినా ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన సురేష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంచెతో ఉరి వేసుకున్నాడు. మృతుని తల్లి సలాది నాగమణి ఇంటికి వచ్చేటప్పటికి సురేష్ ఉరి వేసుకొని వేలాడుతుండడంతో స్థానికుల సహాయంతో కిందకు దించి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో స్వీటుబండి వ్యాపారి మృతి
పెనమలూరు: పోరంకి–నిడమానూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం నిడమానూరుకు చెందిన ప్రజాపతి మోనారామ్(40) స్వీట్ బండి వ్యాపారం చేస్తాడు. అతను రాజస్థాన్ రాష్ట్రం కిషన్‌గఢ్ గ్రామం నుంచి కొద్ది సంవత్సరాల క్రితం నిడమానూరుకు వచ్చి భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. గురువారం మోనారామ్ బైక్‌పై పోరంకి నుంచి నిడమానూరుకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మోనారామ్ తలకు బలమైన గాయమయింది. గాయపడిన అతనిని కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రజకీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.