
రారండోయ్ కొండకు పోదాం.. దుర్గమ్మకు సారె ఇద్దాం
● కుటుంబ సమేతంగా తరలివస్తున్న భక్తులు ● భక్త బృందాలతో ఇంద్రకీలాద్రి కిటకిట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో అమ్మవారికి సారెను సమర్పించేందుకు గ్రామాలకు గ్రామాలు తరలివస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా అమ్మవారి చెంతకు చేరుకుంటున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని సారెను సమర్పిస్తున్నారు. అమ్మవారికి సారెను సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో నిత్యం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారికి సారెను సమర్పించేందకు విచ్చేసిన భక్త బృందాలు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకుంటున్నారు. అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెగా తీసుకువచ్చిన చీరలు, పూలు, పండ్లు, మిఠాయిలు, పొంగలి అన్నం, పాయసాలను సమర్పిస్తున్నారు. సారె సమర్పించిన భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అమ్మవారి తరఫున దీవెనలు అందజేస్తున్నారు. సారె సమర్పించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సారె సామగ్రిని ఒకరికి మరొకరు పంచుకుని పండుగ చేసుకుంటున్నారు.

రారండోయ్ కొండకు పోదాం.. దుర్గమ్మకు సారె ఇద్దాం