
ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి
మైలవరం: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మొర్సుమల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామానికి చెందిన జెట్టి శివకృష్ణ(16) పశువులను మేతకు తోలుకు వెళ్లాడు. పశువులు మేత మేస్తూ నీళ్ల కోసం చెరువులోకి దిగాయి. గేదెలను తోలుకు రావడానికి చెరువులోకి దిగిన శివకృష్ణ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాలువలోకి దూకిమహిళ ఆత్మహత్య
పెనమలూరు: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళ బందరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మృతురాలి కుమార్తె నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి కుమారి(57) గత కొద్దికాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి ఒక రొమ్ము తొలగించారు. ఆమె ఆరోగ్యం కోలుకుంది. అయితే రెండవ రొమ్ముకు కూడా క్యాన్సర్ రావటంతో ఇటీవల అది కూడా తొలగించారు. ఆమెకు గుండె జబ్బు కారణంగా మరింత వైద్యచికిత్స చేయటానికి సమస్య తలెత్తింది. దీంతో బాధతో ఉన్న ఆమె ఈనెల 15వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమయింది. ఈ నేపథ్యంలో యనమలకుదురు లాకుల వద్ద బుధవారం రాత్రి శవం ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అది కుమారి మృతదేహమేనని గుర్తించారు.ఈ ఘటనపై ఫిర్యాదు అందటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
నిడుమోలు(మొవ్వ): మండలంలోని నిడు మోలు జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పామర్రు మండలం కనిమెర్ల గ్రామానికి మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కూచిపూడి ఎస్‌ఐ కేఎన్ విశ్వనాథ్ తెలిపిన వివరాల మేరకు కొల్లి శ్రీలక్ష్మి (47) నిడుమోలు శివారులో వ్యవసాయం చేస్తుంది. గురువారం నాట్లు వేయించేందుకు నిడుమోలు వచ్చిన శ్రీలక్ష్మి మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా పామర్రు నుంచి బందరు వెళుతున్న టిప్పరు అతి వేగంగా వెనక నుంచి ఢీకొట్టింది. టిప్పరు సుమారు 50 అడుగుల మేర ఈడ్చుకు వెళ్లటంతో శ్రీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతురాలి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూచిపూడి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త గతంలో మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి