
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
యువతికి తీవ్రగాయాలు
గన్నవరం: మండలంలోని మర్లపాలెం వద్ద ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, అతని స్నేహితురాలైన యువతి తీవ్రంగా గాయపడిన సంఘటనపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం...ఆగిరి పల్లి మండలం ఈదులగూడెంకు చెందిన ఈడే పవన్‌కుమార్(22) విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగిగా చేస్తున్నాడు. చిన్నఅవుటపల్లి మండలం పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఇబ్రహీంపట్నంకు చెందిన గరికపాడు భాగ్యలక్ష్మితో అతనికి ఇటీవల స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి భాగ్యలక్ష్మిని బైక్‌పై ఎక్కించుకున్న పవన్‌కుమార్ జాతీయ రహదారి బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపు బయలుదేరారు. అతివేగంగా బైక్ నడుపుతున్న పవన్‌కుమార్ మర్లపాలెం వద్ద రహదారిపై ఆగివున్న లారీని ప్రమాదవశాత్తు వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పవన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, భాగ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వారి మిత్రులు అక్కడికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న భాగ్యలక్ష్మిని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్‌కుమార్ మృతదేహానికి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి అతని బంధువులకు అప్పగించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇదే ఆస్పత్రికి చెందిన నర్సింగ్ కళాశాలలో స్టాఫ్ నర్సు కోర్సు పూర్తిచేసిన భాగ్యలక్ష్మి నాలుగు రోజుల క్రితం నర్సుగా ఉద్యోగంలో చేరినట్లు సహచర విద్యార్థులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం