
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
పెడన: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులపై టీడీపీ, జనసేన గూండాల దాడి రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బీసీ మహిళను కారులో నిర్బంధించి దాడి చేయడం దారుణమన్నారు. హారికను దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండి తోక జగన్మోహనరావు, ఎన్టీఆర్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అనుబంధ సంఘాల నాయకులు మంగళవారం పరామర్శించారు. హారిక, రాము దంపతులపై గుడివాడలో టీడీపీ, జనసేన గూండాలు దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హారిక, రాము దంపతులను వైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ అనుమతి తీసుకోవాలా?
మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలో టీడీపీ, జనసేన గూండాలు హారికపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. గుడివాడలో సభ పెట్టాలంటే టీడీపీ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. అసలు పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. దాడులు చేస్తుంటే చూస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. తెలుగు యువత, తెలుగు మహిళ మాదిరిగా తెలుగు పోలీస్ అని పేరు పెట్టుకోవాలని సూచించారు. బీసీ మహిళపై దాడి జరిగితే మహానటి అంటారా అని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థ డమ్మీగా మారిందని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) ధ్వజమెత్తారు. రౌడీలకు, గూండాలకు గులాంగిరీ చేస్తున్న వ్యవస్థగా మారిందని ఆరోపించారు. దాడులు జరుగుతున్న సమయంలో డీఎస్పీ, సీఐలు, పోలీసులు చూస్తూనే ఉన్నారని, వ్యవస్థ న్యాయం చేయలేని రోజు తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హారిక దంపతులకు కొడాలి నాని పరామర్శ
పెడన: జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము దంపతులను మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పరామర్శించారు. మంగళవారం రాత్రి ఆయన పెడన మండలం కృష్ణాపురంలోని రాము నివాసానికి చేరుకుని హారికపై ఇటీవల జరిగిన దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కిట్టు, నంది వాడ ఎంపీపీ పెయ్యేటి ఆదాం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి సుబ్రహ్మణ్యం(చంటి), రామిరెడ్డి, మిరియాల రాజేంద్రప్రసాద్, గుదె రవి తదితరులు పాల్గొన్నారు.
హారిక, రాము దంపతులను పరామర్శిస్తున్న అవినాష్, విష్ణు, జగన్మోహనరావు, పేర్ని కిట్టు తదితరులు
అవినాష్ మాట్లాడుతూ.. బీసీ మహిళపై పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం చూస్తుంటే రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలుకావడంలేదని స్పష్టమైందన్నారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్ నేతృత్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై దాడి అందుకు ఉదాహరణన్నారు. హారికకు తామంతా అండగా ఉంటామన్నారు. దాడులు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళ కన్నీరు పెట్టుకుంటే మంత్రి కొల్లు రవీంద్ర కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. తక్షణమే హారికకు రవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడికి ప్రతి దాడి ఓటు రూపంలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్‌చార్జి మొండితోక జగన్మోహనరావు అన్నారు. టీడీపీ గూండాలే దాడి చేసి బాధితులపై ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. తాము హారిక కుటుంబానికి అండగా ఉంటామన్నారు.