కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు జిల్లాలోని బడ్డీకొట్లు, ఇతర దుకాణాల్లో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. విద్యాసంస్థల సమీపంలో మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, అమ్మకాలకు సంబంధించి ఆపరేషన్ సేప్ క్యాంపస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని సబ్–డివిజన్‌లకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. అనుమానిత దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. మచిలీపట్నంలో జరిగిన సోదాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. బడ్డీ వ్యాపారులు మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఈ సోదాలు నిరంతరం జరుగుతాయని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని కోరారు.