
ప్రమాదాల నివారణకు స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో
లబ్బీపేట(విజయవాడతూర్పు): అర్థరాత్రి సమయాల్లో...వేకువ జామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసులు ‘స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు మాచవరం మహానాడు రోడ్డులో, సత్యనారాయపురం శారద కళాశాల సమీపంలో, భవానీపురం గొల్లపూడి హైవే, తిరువూరు హైవే, జి.కొండూరు హైవే సమీపంలో పోలీసు అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారు జామున 2 నుంచి 5 గంటల వరకూ నిద్రమత్తులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున, ఆ సమయంలో పోలీసులు వాహనాలను ఆపి నీళ్లతో ముఖం కడుక్కుని నిద్రమత్తు వీడేలా చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా చేయడం ద్వారా చాలావరకూ ప్రమాదాలను నివారించవచ్చునని పోలీసులు తెలిపారు.
పెళ్లయిన నాల్గో రోజే
నవ వధువు అదృశ్యం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నవ వధువు అదృశ్యమైన ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రైజర్‌పేట జగ్గుపిళ్ళ రామారావు వీధిలో బోయిదాపు మోహన్ మణికంఠ కుటుంబం నివాసం ఉంటుంది. మోహన్ మణికంఠ ఈ నెల 2వ తేదీన పల్లంటి సాయి షణ్ముఖ ప్రియ(21)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 6వ తేదీ మధ్యాహ్నం మణికంఠ, ప్రియ ఇంట్లో టీవీ చూస్తూ నిద్రపోయారు. సాయంత్రం ప్రియకు ఫోన్ రాగా మాట్లాడుకుంటూ బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన ప్రియ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన మణికంఠ బయటకు వెళ్లి వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
విస్తృతంగా సేఫ్ క్యాంపస్ జోన్ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత, విద్యా ర్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు సూచనల మేరకు డీసీపీలు కేజీవీ సరిత, కేఎం మహేశ్వర రాజు పర్యవేక్షణలో కళాశాలలు, స్కూల్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని పాన్‌షాప్‌లు, బడ్డీ కొట్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యాన్ని పాడు చేసే పొగాకు ఉత్పత్తులపై అనుమతులకు వ్యతిరేకంగా, గుట్కా నిల్వలను ఇతర మత్తు పదార్ధాలను కలిగి ఉంటూ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.